"శృంగార శివగంగ"

updated: September 9, 2018 23:20 IST

అమావాస్య రోజు శివాలయంలో నిద్రచేస్తే సంకట హరణమని, ఆరోగ్యం సిద్ధించి అడ్డంకులు తొలగుతాయని శాస్రం చెబుతోంది. అయితే ఈ శ్రావణ మాసపు అమావాస్య ఆదివారం (09-09-2018)సాయంత్రం ఇంచుమించు ఇలాంటిదే జరిగింది విభిన్నంగా. అందుకు వేదిక బహుముఖప్రజ్ఞాశాలి శ్రీ రావి కొండలరావు గారి నివాసం. వారి నిర్వహణలో నడిచే సాహిత్య సంగీత సమాఖ్య సభ్యులతో జరిగిన ఈ సత్సంగంలో పాల్గొన్న ప్రత్యేక అతిథి  ప్రముఖ రచయిత, కవి, నటులు, నిర్మాత, దర్శకులు ... ప్రత్యేకించి శివాంశ సంభూతులు శ్రీ తనికెళ్ళ భరణి గారు. సాహిత్య సంగీత సమాఖ్య సభ్యులే కాకుండా వెండితెర కళాకారులు మాన్యశ్రీ రాళ్ళపల్లి, వైజాగ్ ప్రసాద్, కోట శంకరరావు, ఉత్తేజ్, సంభాషణల రచయిత శ్రీ రాజేంద్రకుమార్, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అట్లాంటా నగరవాసి, ముఖ్య సమాచార అధికారి శ్రీ వల్లూరి రమేష్, నవ్య వారపత్రిక సంపాదకులు శ్రీ జగన్నాథ శర్మ, ఘంటసాల గళామృతం కల్పయిత శ్రీ కొల్లూరి భాస్కరరావు, ప్రసారభారతి పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ అనంత పద్మనాభరావు, జ్యోతిషరత్న శ్రీ సాగర్  తదితర ప్రముఖులు యెందరో పాల్గొన్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ రావి కొండలరావు శ్రీ తనికెళ్ళ భరణి గారిని పరిచయం చేస్తూ, “మహాశివుడి ప్రవరలో గంగమ్మ పాత్ర వుండీలేనట్టీ వుంటుంది. ఆకాశంబున నుండి శంభుని శిరంబు, అందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి, అందుండి గంగమ్మ భువికి చేరిందనే విషయం మనకు తెలియంది కాదు. అలా శివుడి తలపుల్లో వున్న గంగా-పరమేశ్వరుల ప్రేమకథ రాస్తే, గంగమ్మ శివుని మనువాడినట్లు ఊహిస్తే ఎలావుంటుందనే ఆలోచన మిత్రుడు శ్రీ భరణికి కలిగింది. తత్ఫలితమే శ్రీ భరణి తలపులనుంచి ‘గంగాప్రవాహంగా జాలువారిన పద్య కావ్యం ‘శృంగార గంగావతరణం’. వారం రోజులక్రితం శ్రీ భరణి ఆ కావ్యంలోని కొన్ని పద్యాలను నాకు వినిపిస్తే పులకించిపోయాను. నాకు బహూకరించిన ఆ పుస్తకాన్ని పదేపదే చదివాను. మా సంస్థ కార్యదర్శి శ్రీ షణ్ముఖాచారి తో చర్చించాను. మన సభ్యులకే కాకుండా సన్నిహిత మిత్రులకు ఈ కావ్యాలాపన శ్రీ భరణి చేతనే చేయించి  ఆ కావ్యానికి విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించాం. ఇప్పుడు శృంగార గంగావతరణ కావ్యపఠనం వారి గళం నుంచే విందాం” అన్నారు. కావ్యపఠనానికి ముందుగా ‘దేవస్థానం’, ‘మిధునం’ చిత్ర సంగీత దర్శకులు శ్రీ స్వర వీణాపాణిని, మృదంగ వాద్యకారుడు శ్రీ రఘు ని భరణి గారు సభకు పరిచయం చేశారు.

 

*గళమెత్తిన భరణి స్వరం... శ్రోతలకో వరం*

పూజ్యులు శ్రీ శివశక్తి దత్త గారు రచించిన ‘గగన గంగావతరణం’ ప్రౌఢకావ్యాన్ని చదివినప్పుడు తనకూ ఆ గంగమ్మ తల్లిని గురించిన ఒక పద్య కావ్యాన్ని రాయాలనిపించి విభిన్న కోణంలో ‘శృంగార గంగావతరణా’న్ని రాయ సాహసించానని ప్రారంభ సందేశంలో శ్రీ భరణి సభికులకు తెలిపారు. నాలుగు పాదాలతో సరళమైన వాడుక భాషలో ఒదిగిన ఈ పద్యకావ్యంలో ప్రతి పద్యం ‘గా’ అనే అక్షరంతో ముగియడం శ్రీ భరణి గారి కవితా ప్రతిభకు ఓ దివ్యాభరణం. మానవుల పాపాలు కడిగేందుకు దివినుంచి భువికి భగీరథుని వెంట బయలు దేరిన గంగ పరమశివుని తలమీదకు ఎలా పారిందో వివరించారు ప్రధమ భాగంలో. కాలుమోపి జటలు జూపి ఈశుడు నిలచినప్పుడు గంగమ్మ ఆ శివుని అందాన్ని విస్మయగా వీక్షించిందట. అట్టలు కట్టిన ఆ జడలు వూయలలై ఊగుతుంటే గంగమ్మ ఆ జటాజూటాన్ని ఆవాసం చేసుకోబోయిందట. ఆ వేగానికి గంగ పయ్యెద గాలిలో తేలి మారేడుకొమ్మలకు చిక్కుకోగా, సిగ్గుపడుతున్న ఆ గంగను ఈశుని కంఠ రుద్రాక్షలు చాటునుంచి చూసి చిలిపిగా నవ్వాయట. వచ్చిన పని మరచిన గంగమ్మ అలలన్నీ కలలై ఆ పరమేశుని చూసినంత ప్రేమలో మునిగిందట. తనకీ, హరునికి పెండ్లని ఊహించుకుంటూ కలోకి జారిందట ఆ గంగామాత. ఇక రెండవ భాగంలో గంగమ్మ కనిన కలని స్పృశించారు రచయిత. పసుపురుద్ది మంగళస్నానం చేసిన గంగమ్మ మేనిరంగు బంగారంగా మారిందట. బ్రహ్మదేవుడు ఇరువురి మధ్య తెరపట్టి సుముహూర్తమంటూ ‘కేకలు’ పెడుతూ జీలకర్ర, బెల్లాలను శంభుడు గంగ శిరం మీద మోపగానే ఇరువురు దంపతులయ్యారట. ఇంకేముంది గంగ సాంబుని తలమీద నిలిచి తాండవమాడుతుంటే సతి పార్వతి విడ్డూరంగా చూసిందట. గణేశుడు, షణ్ముఖుడు మేమున్నామని, బెంగవలదని తల్లికి చెబుతుంటే, పార్వతి వాహనమైన సింహం   గర్జించిందట...నంది రంకెవేసి గంగను కొమ్ములతో కుమ్ముతాననిపార్వతికి ధైర్యం చెప్పిందట. శివుని కంఠమలంకరించిన సర్పరాజు “కిందకు దిగనియ్యను, దిగితే కాటేస్తా” అని అభయమిచ్చిందట. అక్క పార్వతి ఎన్ని తపములు చేసిన  ఫలమో అర్ధశరీరంబయ్యిందని చూసిందట గంగ ఆశ్చర్యంగా. శివకుటుంబమంతా తనమీద కత్తికడితే, గంగమ్మ జడిసిపోయి గుండెలు జారుతుండగా హరుడు జారిపోయే గంగచేతిని పట్టుకున్నాడట. అక్కడేవున్న బ్రహ్మ ‘పాణిగ్రహణం’ అయిపోయిందని ప్రకటన చేశాడట. ఇక తలంటి, సున్నిపిండి పూసి స్నానమాచరించి, జలతారు చీర కట్టి, బుగ్గమీద చుక్కతోటి మెరుస్తూ ‘కార్యం’ గదికి కాళ్ళు తడబడుతుండగా గంగమ్మ పాలపాత్రను పట్టుకొని వస్తుంటే, ఆ పాలు నేలపాలయ్యాయట. శివుని పాదపద్మాలను కళ్ళకద్దుకొంటూవుంటే హరుడు చూపుడు వేలితో గంగ చుబుకాన్ని పట్టి లేపాడట. మంచుదిబ్బలే పందిరిమంచంగా వెన్నెల్లో పవళించారట ఇద్దరూ. ముడుపు కట్టిన వయసును గంగమ్మ తల్లి శివునికి ధారపోసి కౌగలించుకొందట. పంచభూతాలు సాక్షీభూతంగా గంగమ్మ పృథ్వి లింగాన్ని తడిపిందట. గాలిబుడగలు రేగిన వాయులింగానికి గంగమ్మ వందనం చేసిందట. ఆకాశాలింగాన్ని అంటుకోగానే ఆ శూన్యం నుంచి శృంగారం జనియించిందట. జంబులింగాన్ని ఆలింగనం చేసుకోగానే, నీరు ఒరుసుకొని నిప్పులు రాలాయట. ఆ తేజోలింగాన్ని హత్తుకొనంగనే కామదహనమై హరుని కళ్ళు చల్లబడ్డాయట. పైనుంచి దేవతలు ఆనందంగా అక్షతలు చల్లుతుంటే కలలుగంటున్న గంగ ఉలిక్కిపడి లేచిందట.

ఇక మూడవ భాగంలో భగీరథుని కార్యార్థియై వచ్చిన గంగ అతడి అభీష్టాన్ని నెరవేర్చేందుకు బొట్టుబొట్టుగా శివుని నుదుట మీదికి జారిందట. ఆ పరమశివుని నుదుట విబూది తో కలవంగానే ఆనీరు  తీర్థంగా మారిందట. శివుని మూడవ నేత్రం మీదకు జారగానే గంగ మరిగి ఆవిరులై కొనదేలిన ముక్కు మీదకు జారిందట. ఆనీటి బొట్లు ముత్యాలుగా మారుతుండగా ఆధరాలను తాకిందట అతి మధురంగా. గరళాన్ని అమృతంగా మింగిన ఆ సదాశివుని కంఠం మీదకు చేరి గౌరవంగా నమస్కరించిందట. శెలవిమ్మని శివుని గంగ ప్రార్థించంగా “పరమ పాపి కూడా గంగలో మునిగితే పాపాలు పరిహారమౌతాయ”ని, అదే తన వరమని శివుడు అభయమిచ్చాడట. నరనరాన శివుని వరం ప్రవహిస్తూవుంటే గంగ భగీరథుని వెంట భువికి సాగిందట సంబరంగా. భగీరథుని వలన భువికి దిగిన ఆ గంగ భరతఖండం పుణ్యం చేసుకోనంగా ‘భాగీరథి’ అయ్యిందట.

ఆ గంగిగోవు వంటి గంగమ్మ తల్లి శృంగారావతరణ  వృత్తాంతాన్ని అత్యద్భుతంగా రాగ యుక్తంగా శ్రీ భరణి ఆలపిస్తూవుంటే, పద్యపద్యానికి చప్పట్లు మిన్నుముట్టుతూనే వున్నాయి. వీణాపాణి ముని వ్రేళ్ళు సుతారం గా హార్మోనియం మీద నాట్యం చేస్తూవుంటే, డప్పు చప్పుళ్ళు సంబరం చేశాయి. శృంగార గంగావతరణం ను వినూత్నంగా ఆవిష్కరింపజేసిన శ్రీ తనికెళ్ళ భరణి గారిని శ్రీ రావి కొండలరావు ఐదురకాల పండ్లతో, దుశ్శాలువ తో సత్కరించగా, సభికులంతా ఆనందభరితులై లేచినిలబడి అభినందనలు తెలిపారు. సాహిత్య సంగీత సమాఖ్య కార్యదర్శి శ్రీ ఆచారం షణ్ముఖాచారి వందన సమర్పణ చేశారు. తీపి పదార్ధాలతో కూడిన తీనీటి సేవనం ఆరగించిన సభికులు మనసంతా శివమయం కాగా తదాత్మ్యం పొందిన నిండు హృదయాలతో స్వగృహాలకు పయనమయ్యారు.

అదే అదే గంగ, కరుణాంతరంగ/దివి నుండి దిగివచ్చెను పాపము కడుగంగా” అంటూ మొదలయ్యే ఈ పద్య కావ్యం... “గంగిగోవు వంటి గంగ మునివెంట చనంగా/ఆర్యావర్తం బంతయు ఆయె పావనంగా” అంటూ మంగళకరంగా ముగుస్తుంది.

*శుభం భూయాత్*

ఆచారం షణ్ముఖాచారి గారు

 

ఫోటో గాలరీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి


Tags: Raavi Kondala Rao, Tanikella Bharani, Rallapalli, Ramesh Valluri, shanmukha chari, Vizag Prasad, Uttej, Phani Prakash, Sri Raghu

comments